After 10th: ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత ఏం చేయాలి? మీ కెరీర్‌కు సరైన దారి..! 11 month ago

featured-image

ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దివిన త‌రువాత ఏం చేయాల‌న్న సందేహాలు అటు విద్యార్ధుల్లోనూ, ఇటు త‌ల్లిదండ్రుల్లోనూ రావ‌డం స‌హ‌జం. కుటుంబ ఆర్ధిక ప‌రిస్థితుల నేప‌థ్యం ఒక‌వైపు, పిల్లాడి ప్ర‌తిభా పాట‌వాలు మ‌రోవైపు ఎటువెళ్లాల‌నేది నిర్ణ‌యిస్తుంది. అయితే, ఇప్పుడు ప‌దో త‌ర‌గ‌తి త‌రువాత ఇంట‌ర్ ఎక్కువ మంది చ‌దువుతున్నారు. ఈనేప‌థ్యంలో ఇంట‌ర్‌లో ఆర్ట్స్ గ్రూపులు తీసుకుంటే ఎలా ఉంటుంది... సైన్స్ గ్రూపులు తీసుకుంటే ఎలా ఉంటుంది...అన్న దానిపై చిన్న పాటి విశ్లేష‌ణ చూద్దాం.


ఎంపిక ఇలా చేసుకుంటే మంచిది....

ఇంట‌ర్‌లో తీసుకొనే గ్రూప్ ఎంపిక అనేది విద్యార్ధి జీవితంలో ఒక కీల‌క మ‌లుపు. భవిష్య‌త్తు కెరీర్ మొత్తం దీనిపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. విద్యార్ధి పాఠ‌శాల స్థాయిలో త‌మ‌కు ఏ స‌బ్జెక్టుల‌పై ఎక్కువ ఇష్టం ఉందో చూసుకొని, వాటి ఆధారంగా గ్రూపును ఎంపిక చేసుకోవాలి. ఏ గ్రూపును ఎంపిక చేసుకుంటున్నామో అది పూర్త‌యిన రెండేళ్ల త‌ర్వాత భ‌విష్య‌త్తు ఏమిటి? అనేదానిపై ముందుగానే ఆలోచించి విద్యార్ధులు, త‌ల్లిదండ్రులు నిర్ణ‌యం తీసుకోవాలి. స్నేహితులు, సీనియ‌ర్లు, శ్రేయాభిలాషుల స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూనే స్వీయ సామ‌ర్ధ్యం, కుటుంబ ఆర్ధిక ప‌రిస్థితి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని గ్రూప్‌ను ఎంపిక చేసుకోవాలి.


ఎంఈసీ, సీఈసీల‌తో....

సైన్స్ స‌బ్జెక్ట్‌పైన ఆస‌క్తి లేని వారు, వ్యాపారంలో స్థిరప‌డాల‌నుకునేవారు, బ్యాంక్ సెక్టార్‌లో చేరాల‌నుకునేవారు ఇంట‌ర్‌లో ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో చేర‌వ‌చ్చు. గ‌ణాంకాల విశ్లేష‌ణ‌, వ్యాపార వ్య‌వ‌హారాల‌పై ఆస‌క్తి ఉన్న‌వారికి స‌రియైన‌ గ్రూపులు సీఈసీ, ఎంఈసీ. ప్ర‌స్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార పారిశ్రామిక రంగం శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతుంది. ఈ నేప‌థ్యంలో కామ‌ర్స్‌లో నైపుణ్యాలున్న వారికి చార్టెడ్‌ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్ర‌ట‌రీ వంటి ప్రొఫెష‌నల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూల‌మైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ. ఏ కోణంలో చూసినా వీటిలో అవ‌కాశాలు పుష్క‌లంగానే ఉన్నాయి. రెండు సంవ‌త్స‌రాల‌లోని సిల‌బ‌స్‌పై పూర్తి అవ‌గాహ‌న క‌లిగి ఉంటే సీఏ, సీపీటిని విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌వ‌చ్చు. ఈ కోర్సుల‌ను పూర్తి చేస్తే చిన్న‌ వ‌య‌సులోనే భారీ వేత‌నాలు వ‌చ్చే ఉద్యోగాల‌ను పొంద‌వ‌చ్చు. ఇంట‌ర్‌లో సీఈసీ, ఎమ్ఈసీ గ్రూపులు తీసుకొని, త‌ర్వాత‌ సీఏ, సీపీటీ చేయ‌ని వారు బీకాంలో చేరొచ్చు. త‌ర్వాత ఆస‌క్తి ఉంటే ఎంకామ్‌, పీహెచ్‌డీ చేయొచ్చు. సీఈసీ, ఎంఈసీ త‌ర్వాత చాలా మంది బీకాంలో చేర‌తారు. ఇప్పుడు బీకాంలో కూడా ప‌రిశ్ర‌మ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా ప్ర‌త్యేక స్పెష‌లైజేష‌న్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిల‌ర్ డిగ్రీలో బీకాం అడ్వ‌ర్ట‌యిజింగ్‌, సేల్స్ అండ్ ప్ర‌మోష‌న్‌, ఫారిన్ ట్రేడ్ ప్రాక్టీసెస్‌, ట్యాక్స్ ప్రొసీజ‌ర్స్ అండ్ ప్రాక్టీసెస్ లాంటి విభిన్న స్పెష‌లైజేష‌న్ల‌ను ఎంచుకోవ‌డం ద్వారా త్వ‌ర‌గా స్థిర‌ప‌డొచ్చు.


ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు స‌రైన దారి... హెచ్ఈసీ

హెచ్ఈసీ గ్రూప్‌లో చేరాల‌నుకునే విద్యార్ధుల‌కు రాత నైపుణ్యాలు, నిరంత‌ర అధ్య‌య‌నం ఉండాలి. సామాజిక అంశాల‌పై బాగా అవ‌గాహ‌న ఉండి, స‌మాజంలో ఎప్ప‌టిక‌ప్పుడు చోటుచేసుకునే ప‌రిణామాల‌ను అన్వేషించే నైపుణ్యం ఉన్న‌వారికి స‌రైన గ్రూప్ హెచ్ఈసీ. హిస్ట‌రీ, ఎక‌నామిక్స్‌, సివిక్స్ స‌బ్జెక్టుల్లో మంచి ప‌ట్టు సాధిస్తే సివిల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర‌య్యే అభ్య‌ర్ధులు చాలా సునాయాసంగా ప్రిప‌రేష‌న్‌ను కొన‌సాగించ‌గ‌ల‌రు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వివిధ ఉద్యోగాల‌కు నిర్వ‌హించే పోటీ పరీక్ష‌ల్లో విజ‌యం సాధిస్తే ప్ర‌భుత్వ ఉద్యోగంలో చేరి ఉన్న‌త‌ కెరీర్‌కు బాట‌లు వేసుకోవ‌చ్చు. ఉన్న‌త విద్య కోణంలోనూ హెచ్ఈసీ త‌ర్వాత అనేక అవ‌కాశాలున్నాయి. ఒక‌ప్పుడు హెచ్ఈసీ త‌ర్వాత బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్ట్స్‌లో మాత్ర‌మే చేర‌డానికి అవ‌కాశ‌ముండేది. ఇప్పుడు బీఏలోనూ హోట‌ల్ మేనేజ్‌మెంట్‌, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, సోష‌ల్ వ‌ర్క్ త‌దిత‌ర వృత్తి విద్య స్పెష‌లైజేష‌న్లు అందుబాటులోకి వ‌చ్చాయి.


ఎంపీసీని ఎంచుకొంటే కెరీర్ అవ‌కాశాలు ఇలా.....

గ‌ణింత‌పై మ‌క్కువ ఉండి, వివిధ సూత్రాల‌ను వేగంగా అన్వ‌యించే నైపుణ్యం, ఒక స‌మ‌స్య‌ను విశ్లేషించి, వేగంగా సాధ‌న‌ను కున‌క్కొనే నైపుణ్యాలు ఉన్న విద్యార్ధుల‌కు, ఇంజినీర్‌గా కెరీర్‌లో స్థిర‌ప‌డాల‌నుకునే వారు ఇంట‌ర్మీడియ‌ట్‌లో మ్యాథ‌మెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ (ఎంపీసీ) స‌రైన గ్రూప్‌. ఎంసెట్‌, జేఈఈ మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్, బిట్‌శాట్ త‌దిత‌ర పోటీ ప‌రీక్షల్లో మంచి ర్యాంకు వ‌స్తే ఐఐటీ, నిట్‌లు వంటి టాప్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల్లో సీటు సంపాదించ‌వ‌చ్చు. 


మంచి కాలేజీల్లో అవ‌కాశం దొరికితే.....

మంచి కాలేజ్‌లో సీటు రావ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఏంటంటే ఆ కాలేజ్‌లో మంచి నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులతో బోధ‌న‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లు అన్నీ సౌక‌ర్యాలున్న‌ ల్యాబ్, ప్రాక్టిక‌ల్ స్కిల్స్ విద్యార్ధుల‌కు అందిస్తారు. ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి ఇంట‌ర్‌లో చేరిన మొద‌టి రోజు నుంచి కృషి చేయాలి. ఇంజినీరింగ్ చేయాల‌నుకునే వారికి చాలా కోర్సులు ఉన్నాయి. ప్ర‌స్తుతం డిమాండ్ ఉన్న కోర్సులు ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, డాటా సైన్స్‌, సైబ‌ర్ సెక్యూరిటీకి సంబంధించిన‌వి. ఇంజినీరింగ్ కోర్సులో చేర‌డం ఆస‌క్తి లేని వారు, ఎంపీసీ త‌ర్వాత డిగ్రీలో బీఎస్సీ తీసుకొని, త‌ర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ వంటి ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించి ప‌రిశోధ‌న‌లు దిశ‌గా జీవితంలో స్థిర‌ప‌డ‌వ‌చ్చు. ప్ర‌ధానంగా పీజీ, పీహెచ్‌డీ అర్హ‌త‌తో ఆర్ అండ్ డీ సెంట‌ర్లు, ఫార్మాస్యూటిక‌ల్ ప‌రిశ్ర‌మ‌లు, ప‌రిశోధ‌న సంస్ధ‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌లు, బెవ‌రేజెస్ కంపెనీలు వంటి వాటిల్లో శాస్త్రవేత్త‌లుగా, సైంటిఫిక్ అసిస్టెంట్‌గా అవ‌కాశాలు ఉంటాయి.


బైపీసీ ని ఎంచుకొంటే భ‌విష్య‌త్ భ‌ళా......

వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు, మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండి, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్న వారికి బ‌యాల‌జీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (BIPC) స‌రియైన గ్రూప్‌. ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. బైపీసీ తర్వాత నీట్‌, ఎయిమ్స్, జిప్‌మర్, సీఎంసీ తదితర పరీక్షల ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్‌గా జీవితంలో స్థిరపడటం సుదీర్ఘ ప్ర‌క్రియ‌. ఇంట‌ర్ రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన త‌ర్వాత ఎంబీబీఎస్‌, ఆ త‌ర్వాత పీజీ మెడిసిన్ (సూప‌ర్ స్పెషాలిటీ) కోర్సు చేయాలి. అందువ‌ల్ల కుటుంబ ఆర్ధిక ప‌రిస్థితి బాగుండి, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్ధులు బైపీసీలో చేర‌వ‌చ్చు. బైపీసీ త‌ర్వాత‌ బీడీఎస్‌, పారామెడిక‌ల్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, హోమియోప‌తి త‌దిత‌ర కోర్సులు తీసుకోవ‌చ్చు. లేదా యూజీలో న‌చ్చిన గ్రూప్‌లో చేరొచ్చు. త‌ద‌నంత‌రం పీజీ, ప‌రిశోధ‌న‌లు దిశ‌గా వెళ్ళొచ్చు.


ఉన్నత చదువులకు పునాది మాధ్యమిక విద్య.!

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD